ఐరోపా అణు పరిశోధన సంస్థ (సెర్న్) శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే తొలిసారిగా యాంటీప్రొటాన్లను ట్రక్కు ద్వారా ప్రయోగాత్మకంగా రవాణా చేశారు. యాంటీప్రొటాన్ వంటి ప్రతిపదార్థం (యాంటీమ్యాటర్).. సాధారణ పదార్థం (మ్యాటర్)తో కలిస్తే నాశనమవుతుంది. ఈ క్రమంలో శక్తి విడుదలవుతుంది. తాజా ప్రయోగంలో భాగంగా 92 యాంటీప్రొటాన్లను ప్రత్యేకంగా రూపొందించిన క్రయోజెనిక్ పెన్నింగ్ ట్రాప్‌లో ఉంచారు.
అందులో భారీగా శీతలీకరించిన, సూపర్ కండక్టింగ్ అయస్కాంతాలను అమర్చారు. ఈ పెట్టెను ట్రక్కులో ఉంచి రోడ్డుపై కొద్దిసేపు రవాణా చేశారు. ఆ తర్వాత తిరిగి ల్యాబ్‌కు తరలించారు. ఈ ప్రయోగ సమయంలో క్రయోజెనిక్ పెన్నింగ్ ట్రాప్ గోడలకు యాంటీప్రొటాన్లు తగలకుండా శూన్యంలో తేలియాడుతూ ఉన్నాయి. పెట్టెల గోడలకు తాకకుండా ఈ రేణువులను ఒక చోటు నుంచి మరో చోటుకు రవాణా చేయవచ్చా అన్నది చూడాలన్నది శాస్త్రవేత్తల ఆలోచన.