హిందూ మహాసముద్రంలోని చాగోస్ దీవులపై బ్రిటన్ తన సార్వభౌమత్వాన్ని మారిషస్‌కు బదిలీ చేసే ప్రక్రియ పూర్తయ్యింది.
ఈ మేరకు చారిత్రక ఒప్పందంపై తాను సంతకం చేసినట్లు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ 2025, మే 22న ప్రకటించారు.
దీంతో సుమారు రెండు శతాబ్దాలుగా ఆ ద్వీపసమూహంపై తమ ఆధిపత్యాన్ని బ్రిటన్ వదులుకున్నట్లైంది.
ఈ దీవుల్లో అతిపెద్దదైన డీగో గార్సియా.. నేవీ, బాంబర్ స్థావరాలతో వ్యూహాత్మక స్థానంలో ఉంది.
తాజా ఒప్పందం ప్రకారం ఆ దీవి భద్రతకు బ్రిటన్ బాధ్యత వహించనుంది.
దీంతోపాటు ఆ స్థావరాన్ని కనీసం 99 ఏళ్లకు లీజుకు తీసుకొని, మారిషస్‌కు ఏడాదికి 136 మిలియన్ డాలర్లు చెల్లించనుంది.
అమెరికా దళాలు నిర్వహిస్తున్న ఈ రక్షణ స్థావరం భవిష్యత్తులో బ్రిటన్-అమెరికా భద్రత, నిఘా కార్యకలాపాల్లో కీలకం కానుంది.