శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్లను త్వరగా అందుబాటులోకి తెచ్చే దిశగా మైక్రోసాఫ్ట్ మయోరానా-1 పేరుతో ఒక విప్లవాత్మక క్వాంటమ్ ప్రాసెసింగ్ యూనిట్ (క్యూపీయూ)ను ఆవిష్కరించింది.
అరచేతిలో ఇమిడిపోయే ఈ సాధనాన్ని ‘గాడ్ చిప్’గా పేర్కొంటున్నారు. ఇది కంప్యూటింగ్ తీరుతెన్నులను సమూలంగా మార్చివేయనుందని నిపుణులు చెబుతున్నారు.
పదార్థ శాస్త్రం, కృత్రిమ మేధ, కొత్త ఔషధాల ఆవిష్కరణ తదితర రంగాల్లో విప్లవాత్మక మార్పులకు బాటలు పరుస్తుందని పేర్కొంటున్నారు.
మయోరానా-1 సాధనం టోపోలాజికల్ కోర్‌పై నిర్మితమైన తొలి క్వాంటమ్ ప్రాసెసింగ్ యూనిట్ అని మైక్రోసాఫ్ట్ పేర్కొంది. పదార్థానికి సంబంధించి కొత్తగా కనుగొన్న ఒక దశ సాయంతో ఈ చిప్ పనిచేస్తుంది.