ఏఐ ఇంపాక్ట్ సమిట్‌లో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చిన దేశాధినేతల్లో ఏడుగురితో 2026, ఫిబ్రవరి 18న దిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై వారితో చర్చించారు. ఇద్దరు సీఈవోలతోనూ మోదీ భేటీ అయ్యారు. భారత్, ఐరోపా కూటమి (ఈయూ) మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో (ఎఫ్‌టీఏ) స్వర్ణ యుగానికి నాంది పలికామని మోదీ పేర్కొన్నారు
స్పెయిన్ ప్రభుత్వాధినేత పెడ్రో శాంచెజ్‌తో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. భారత్, స్పెయిన్ సంబంధాలు, వాణిజ్యం, పెట్టుబడులు, టెక్నాలజీ, మౌలిక వసతులు, వాతావరణం, పునరుత్పాదక ఇంధన వనరులు, రక్షణ, భద్రత, అంతరిక్షం, సంస్కృతి, పర్యాటకం, ప్రజల మధ్య సంబంధాలపై ఇద్దరు నేతలూ చర్చలు జరిపారు. 2026ను భారత్-స్పెయిన్ సాంస్కృతిక, పర్యాటక, ఏఐ సంవత్సరంగా గుర్తిస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు.
ఎఫ్‌టీఏకు మద్దతుగా నిలిచినందుకు ఫిన్లాండ్ ప్రధాని పెటెరి ఆర్పోకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని రెట్టింపు చేసుకోవాలని భేటీ సందర్భంగా ఇద్దరు నేతలు నిర్ణయించారు. ఇంకా 6జీ, ఆవిష్కరణలు, శుద్ధ ఇంధనం, బయో ఇంధనాలు, సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థలపై వారి మధ్య చర్చలు జరిగాయి.