భారతదేశంలో 80 శాతం నదీ ప్రవాహాలు యాంటీబయాటిక్స్‌తో కలుషితమై పర్యావరణ, ఆరోగ్య సమస్యలను సృష్టిస్తున్నాయని ఓ అధ్యయనం వెల్లడించింది.
భారత్‌తోపాటు పాకిస్థాన్, వియత్నాం, ఇథియోపియా, నైజీరియాలు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాయని పేర్కొంది.
ఈ పరిశోధనను కెనడాలోని మెక్‌గిల్ విశ్వవిద్యాలయం నిర్వహించింది.
బ్యాక్టీరియా కలిగించే వ్యాధులను నయం చేయడానికి యాంటీబయాటిక్ మందులను వాడతారు.
ఇవి పూర్తిగా మానవ దేహంలో కలిసిపోవు. బ్యాక్టీరియాను నిర్మూలించిన తరవాత యాంటీబయాటిక్ అవశేషాలు కాలేయం, మూత్రపిండాల ద్వారా బయటకు విసర్జితమవుతాయి.
మురుగు నీటి శుద్ధి కర్మాగారాలు కూడా వీటిని పూర్తిగా నిర్మూలించలేవు.
నదుల్లో కలిసిపోయిన యాంటీబయాటిక్ వ్యర్థాలు 31.5 కోట్లమంది భారతీయులపై దుష్పభ్రావం చూపిస్తూ ఉండవచ్చని ఈ అధ్యయనం అంచనా వేసింది.
2000తో పోలిస్తే 2015నాటికి యాంటీబయాటిక్స్ వాడకం 65 శాతం పెరిగిందని గతంలో జరిగిన అధ్యయనాలు అంచనా వేశాయి.