పీఎస్‌ఎల్‌వీ ఆర్బిటాల్ ఎక్స్‌పెరిమెంటల్ మాడ్యూల్ (పీవోఈఎం-4) విజయవంతంగా భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించి, హిందూ మహాసముద్రంలో పడినట్లు 2025, ఏప్రిల్ 5న ఇస్రో ప్రకటించింది.
2024, డిసెంబరు 30న ఇస్రో శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్‌వీ-సి60ని ప్రయోగించి, స్పేడెక్స్ ఉపగ్రహాలను 475 కిలోమీటర్ల నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టింది.
రాకెట్‌లోని నాలుగో దశ భాగమైన పీవోఈఎం-4 కూడా ముందుగా అనుకున్న ప్రకారం అదే కక్ష్యలో పరిభ్రమిస్తూ ఉండిపోయింది.
ఇందులో శాస్త్రవేత్తలు అమర్చిన 24 పేలోడ్‌లు నిర్దేశిత ప్రయోగాలను నిర్వహించి కీలక డేటాను సేకరించాయి.
తదనంతరం ఇస్రో శాస్త్రవేత్తలు పీవోఈఎం-4 ఇంజిన్‌లను పలుసార్లు మండించి 55.2 డిగ్రీల ఒంపుతో 350 కి.మీ. కక్ష్యకు తెచ్చారు.
అనంతరం ఎలాంటి ప్రమాదమూ తలెత్తకుండా మిగులు ఇంధనాన్ని బయటకు పంపేశారు.
అలా ఆ భాగం దిగువ కక్ష్యల్లోకి మారుతూ ముందుగా అంచనా వేసినట్టుగానే భూ వాతావరణంలోకి ప్రవేశించింది.