- భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుందని మనందరికీ తెలిసిందే. సూర్యోదయం, సూర్యాస్తమయం; రాత్రి, పగళ్లు; రుతువుల్లో మార్పులు లాంటివి సంభవించడానికి భూ భ్రమణమే కారణం. భూమి ఆవిర్భావం నుంచి వీటిలో ఎలాంటి మార్పు లేదు. అయితే భూమి తన అక్షంపై తిరుగుతుందని మొదటగా నిరూపించిన శాస్త్రవేత్త లియోన్ ఫోకాల్ట్. ఒక పెండ్యులం సాయంతో ఆయన ఈ విషయాన్ని రుజువు చేశారు. భూ భ్రమణాన్ని నిరూపించినందుకు గుర్తుగా ఏటా జనవరి 8న ప్రపంచవ్యాప్తంగా ‘భూ భ్రమణ దినోత్సవం’గా (Earth’s Rotation Day) నిర్వహిస్తున్నారు. భూమి చలనం, దాని ఆవశ్యకతలను ప్రజలకు తెలియజేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
- చారిత్రక నేపథ్యం
- 1851లో ఫ్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త లియోన్ ఫోకాల్ట్ ఒక లోలకం (పెండ్యులం) సాయంతో మొదటిసారి భూమి భ్రమణాన్ని ప్రపంచానికి చూపించారు. ఆయన పారిస్‌లోని పాంథియోన్ గోపురం నుంచి నేల నుంచి 75 అడుగుల ఎత్తులో స్టెయిన్‌లెస్ స్టీల్ వైర్ ద్వారా ఒక లోలకాన్ని వేలాడదీశారు. అది 200 పౌండ్ల బంగారు పూతతో ఉన్న గోళం. భూ భ్రమణానికి తగ్గట్లు దాని లోలకం తలం కాలక్రమేణా మారుతున్నట్లు ఆ ప్రయోగం రుజువు చేసింది. భూమి తన అక్షం చుట్టూ తిరుగుతుందని నిరూపించేందుకు ఆయన నిర్వహించిన ప్రయోగానికి గుర్తుగా ఏటా జనవరి 8న ‘భూ భ్రమణ దినోత్సవం’గా నిర్వహిస్తున్నారు.