ఇండియన్ ఆర్మీ ప్రపంచంలోనే నాలుగో శక్తిమంతమైన సైన్యంగా గుర్తింపు పొందింది. ఇది భారత రక్షణ దళాల భూతల విభాగం. త్రివిధ దళాల్లో (సైన్యం, వైమానిక దళం, నౌకాదళం) భారత సైన్యం అతిపెద్దది. సరిహద్దుల వెంట దేశ భూభాగాలకు రక్షణ కల్పిస్తూ, ఉగ్రమూక చొరబాట్లను అడ్డుకోవడం వీరి బాధ్యత. జాతీయ భద్రతను కాపాడటం వీరి ప్రథమ కర్తవ్యం. భారత సైన్యం అందించే నిస్వార్థమైన సేవలను గుర్తించే లక్ష్యంతో ఏటా జనవరి 15న భారత సైనిక దినోత్సవం (ఇండియన్ ఆర్మీ డే)గా నిర్వహిస్తారు. దేశం కోసం సైనికులు చేసిన త్యాగాలను గౌరవించడంతోపాటు వారికి నివాళి అర్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం
1947లో భారత్‌కు స్వాతంత్య్రం వచ్చాక కూడా కొన్ని ప్రత్యేక సరిస్థితులు, కారణాల వల్ల బ్రిటిష్‌వారే ఆర్మీ చీఫ్‌గా కొనసాగారు. 1949 జనవరి 15న భారతదేశానికి చెందిన ఫీల్డ్ మార్షల్ ఎం.కరియప్ప మొట్టమొదటిసారిగా ఇండియన్ ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. దీన్ని పురస్కరించుకుని ఏటా జనవరి 15వ తేదీని ‘ఇండియన్ ఆర్మీ డే’గా నిర్వహిస్తున్నారు.