Published on Apr 16, 2025
Current Affairs
భారత న్యాయ నివేదిక-2025
భారత న్యాయ నివేదిక-2025

దేశంలో ప్రతి పది లక్షల జనాభాకు 15 మంది న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారని భారత న్యాయవ్యవస్థపై విడుదలైన ‘భారత న్యాయ నివేదిక-2025’ వెల్లడించింది.

అదే అమెరికాలో ప్రతి 10 లక్షల మంది పౌరులకు 150 మంది జడ్జీలు, ఐరోపాలో 220 మంది జడ్జీలు ఉన్నట్లు వివిధ గణాంకాలు పేర్కొన్నాయి.

2019లో టాటా ట్రస్టు ఆధ్వర్యంలో ఈ అధ్యయనం మొదలుకాగా ‘భారత న్యాయ నివేదిక-2025’ పేరుతో నాలుగో ఎడిషన్‌ తాజాగా విడుదలైంది.

సెంటర్‌ ఫర్‌ సోషల్‌ జస్టిస్, కామన్‌ కాజ్, కామన్వెల్త్‌ హ్యూమన్‌ రైట్స్‌ ఇనీషియేటివ్, దక్ష్, టిస్‌-ప్రయాస్, విధి సెంటర్‌ ఫర్‌ లీగల్‌ పాలసీ, హౌ ఇండియా లివ్స్‌ వంటి సంస్థలు ఈ అధ్యయనంలో పాలుపంచుకున్నాయి. 

నివేదికలోని అంశాలు:

దేశంలో 140 కోట్ల జనాభాకు 21,285 మంది జడ్జీలు ఉన్నారు. అంటే ప్రతి 10 లక్షల మందికి 15 మంది న్యాయమూర్తులు.

1987లో ఏర్పాటైన న్యాయ కమిషన్‌ ఈ సంఖ్య 50గా ఉండాలని సూచించింది.

2025లో హైకోర్టుల్లో మొత్తం మంజూరు చేసిన పోస్టుల్లో 33 శాతం జడ్జి పోస్టులు ఖాళీగా ఉండగా, జిల్లా కోర్టుల్లో అది 21 శాతంగా ఉంది. 

జాతీయ స్థాయిలో చూస్తే జిల్లా కోర్టుల్లో ఒక్కో న్యాయమూర్తిపై 2,200 కేసుల పనిభారం ఉంది.

జిల్లా కోర్టుల్లో మహిళా జడ్జీల ప్రాతినిధ్యం పెరిగింది. 2017లో వారి సంఖ్య 30 శాతం ఉండగా 2025లో 38.3 శాతానికి పెరిగింది.

హైకోర్టుల్లో 11.4 శాతం నుంచి 14 శాతానికి చేరుకుంది. మొత్తంగా  ప్రస్తుతం ఒక హైకోర్టులో మాత్రమే ప్రధాన న్యాయమూర్తిగా మహిళ ఉన్నారు.