దేశవ్యాప్తంగా యువతీ యువకుల్లో సగటున 54.81శాతం మంది 2025లో ఉద్యోగాలు పొందేందుకు అవసరమైన నైపుణ్యాలు సాధించినట్లు ‘భారత నైపుణ్యాల నివేదిక-2025’ వెల్లడించింది.
2021 నాటికి ఇది 45.90శాతం కాగా ఐదేళ్లలో నైపుణ్యాలు సాధించిన యువత సుమారు 9శాతం, దశాబ్దకాలంలో 17% పెరిగింది.
ఉద్యోగ నైపుణ్యాలు సాధిస్తున్నవారిలో ఎంబీఏ విద్యార్థులదే తొలిస్థానం. ఈ కోర్సు పూర్తిచేసినవారిలో 78% మంది అర్హులుండగా, 71.50శాతంతో బీటెక్ అభ్యర్థులు రెండో స్థానంలో నిలుస్తున్నారు.
ఏఐసీటీఈ, సీఐఐ సహకారంతో వీబాక్స్ సంస్థ సర్వే నిర్వహించి ‘భారత నైపుణ్యాల నివేదిక-2025’ను విడుదల చేసింది.
దేశవ్యాప్తంగా 6.50 లక్షల మందికి గ్లోబల్ ఎంప్లాయిబిలిటీ టెస్ట్ (గెట్) పేరిట ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించి నివేదికను రూపొందించారు.
ఈ పరీక్షల్లో 60 శాతానికిపైగా మార్కులు సాధించినవారు 54.81% మంది ఉన్నట్లు తేలింది.