2021-22లో దేశంలోని అన్నిరకాల పోస్టు గ్రాడ్యుయేట్ (పీజీ) కోర్సుల్లో మొత్తం 51.19 లక్షలమంది చేరగా.. వారిలో 28.36 లక్షలమందికి పైగా అమ్మాయిలున్నారు.
వీరికన్నా అబ్బాయిల సంఖ్య దాదాపు 6 లక్షలు తక్కువ.
ఈ విషయాలు కేంద్ర గణాంకాలశాఖ విడుదల చేసిన ‘భారత్‌లో పురుషులు, మహిళలు-2024’ నివేదికలో ఉన్నాయి.
2021-22 సంవత్సరానికి సంబంధించి రూపొందించిన ఈ నివేదికలోని ప్రధానాంశాలు..
అబ్బాయిలు ఎక్కువగా డిగ్రీతోనే చదువు ఆపేస్తుండగా అమ్మాయిలు అంతకుమించి ముందుకెళుతున్నారు.
అలాగే ఎంఫిల్ కోర్సుల్లో మొత్తం 9,517 మంది చేరితే వీరిలోనూ అమ్మాయిలే (6,125) అధికం.
వైద్యకోర్సుల్లోనూ అబ్బాయిలకన్నా అమ్మాయిలు ఎక్కువగా ప్రవేశాలు పొందారు.
2021-22లో దేశంలో మొత్తం అల్లోపతి, హోమియో, ఆయుర్వేదం, నర్సింగ్ తదితర వైద్యశాస్త్రాల కోర్సుల్లో 17.05 లక్షల మంది చేరగా వీరిలో 9.83 లక్షల మందికిపైగా అమ్మాయిలే.
వీరికన్నా అబ్బాయిలు 2.60 లక్షలు తక్కువ. అయితే గైనకాలజీ పీజీ కోర్సులో 404 మంది చేరితే వారిలో 220 మంది అబ్బాయిలే ఉండటం గమనార్హం.