ప్రజలకు కచ్చితమైన సమాచారాన్ని అందించడంలో వార్తాపత్రికలు ముందుంటాయి. ఆధునిక యుగంలో ప్రజా చైతన్యాన్ని పెంపొందించడంలోనూ ఇవి ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. పౌర సమస్యలను ఎలుగెత్తి, పాలనా లోపాలను చాటి, అన్యాయాలను ప్రశ్నిస్తున్నాయి. భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించేలా చేయడంలోనూ వార్తాపత్రికలు కీలకంగా వ్యవహరించాయి. బ్రిటిష్ వారి అకృత్యాలు, అన్యాయాలు, అణచివేతలు కళ్లకు కట్టేలా కథనాలు ప్రచురించడంతోపాటు వారిని ఎదిరించాయి. స్వాతంత్య్రోద్యమంలో జనం భాగస్వాములయ్యేలా ప్రేరేపించాయి. రోజూ వార్తాపత్రికలు చదవాల్సిందిగా ప్రజలను ప్రోత్సహించే లక్ష్యంతో ఏటా మన దేశంలో జనవరి 29న ‘భారతీయ వార్తాపత్రిక దినోత్సవం’గా (Indian Newspaper Day) నిర్వహిస్తారు. సమాజ హితంలో పత్రికలు పోషిస్తోన్న పాత్రను గుర్తించడంతోపాటు వార్తల సేకరణలో జర్నలిస్టుల తెగువ, ధైర్యసాహసాలను గౌరవించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం
మనదేశంలో మొదటి వార్తాపత్రికను ఐర్లాండ్‌కి చెందిన జేమ్స్ అగస్టస్ హిక్కీ 1780, జనవరి 29న ‘ది బెంగాల్ గెజెట్’ పేరుతో ప్రారంభించారు. భారతీయ జర్నలిజానికి పునాది వేసిన పత్రికగా దీన్ని భావిస్తారు. అందుకే మన దేశంలో ఏటా ఆ తేదీన ‘భారతీయ వార్తాపత్రిక దినోత్సవం’గా నిర్వహిస్తున్నారు.