శత్రు డ్రోన్ల సమూహాన్ని స్వల్ప వ్యయంతోనే తుదముట్టించే సరికొత్త కౌంటర్ డ్రోన్ వ్యవస్థ ‘భార్గవాస్త్ర’ను రక్షణ శాఖ వివజయవంతంగా పరీక్షించింది.
సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ సంస్థ (ఎస్‌డీఏఏఎల్) స్వదేశీ పరిజ్ఞానంతో తక్కువ ఖర్చులోనే దీన్ని అభివృద్ధి చేసింది.
ఒడిశాలోని గోపాల్‌పుర్‌లో గల సీవార్డ్ ఫైరింగ్ రేంజ్‌లో ‘భార్గవాస్త్ర’ మైక్రో రాకెట్ వ్యవస్థను పరీక్షించగా.. అన్ని లక్ష్యాలను విజయవంతంగా ఛేదించినట్లు ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ అధికారులు వెల్లడించారు.
దీనికి మొత్తం మూడు పరీక్షలు నిర్వహించారు.
ఈ ‘భార్గవాస్త్ర’ 2.5 కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్న శత్రు డ్రోన్లను గుర్తించి, మైక్రో రాకెట్ల సాయంతో నిర్వీర్యం చేయగలదు.
ఇందులోని రాడార్ వ్యవస్థ.. గగనతలంలో 6 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముప్పులను కూడా పసిగట్టగలదు.