భారత్ అణ్వస్త్ర సామర్థ్యమున్న కె4 బాలిస్టిక్ క్షిపణిని అణుశక్తితో నడిచే ఐఎన్‌ఎస్ అరిఘాత్ అనే జలాంతర్గామి నుంచి దిగ్విజయంగా ప్రయోగించింది.
విశాఖపట్నం దగ్గర్లోని బంగాళాఖాతం నుంచి ఈ పరీక్ష జరిగినట్లు 2024, నవంబరు 28న అధికారిక వర్గాలు వెల్లడించాయి.
దీంతో నేల, నింగితోపాటు సముద్రంలో జలాంతర్గామి నుంచీ క్షిపణులను ప్రయోగించగల సామర్థ్యం కలిగిన అతికొద్ది దేశాల సరసన భారత్ చేరింది.
జలాంతర్గామి నుంచి ప్రయోగించగల బాలిస్టిక్ క్షిపణి (ఎస్‌ఎల్‌బీఎం) తరగతికి చెందిన అస్త్రం కె4. ఇది ఘన ఇంధనంతో నడుస్తుంది.
దీన్ని గత కొన్నేళ్లలో అయిదుసార్లు భారత్ పరీక్షించింది. ఆ పరీక్షలన్నీ సముద్రంలోపల ఏర్పాటు చేసిన ఒక వేదికపై నుంచి జరిగాయి.
జలాంతర్గామి నుంచి దీన్ని ప్రయోగించడం ఇదే మొదటిసారి. చైనాను దృష్టిలో ఉంచుకొని 3500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించేలా దీన్ని రూపొందించారు.