నేటి బాలలే రేపటి భవిష్యత్తు నిర్మాతలు. బాల్యం ఎంత మధురంగా, ఆనందమయంగా సాగుతుందో అంతే గొప్పగా వారి జీవితం కొనసాగుతుంది. చిన్నతనం నుంచి వారు అలవరుచుకునే మంచి అలవాట్లు, ఇతరుల పట్ల గౌరవం, ప్రేమ, ఆదరణ లాంటి లక్షణాలు విలువలతో కూడిన సమాజ నిర్మాణానికి నాందిగా నిలుస్తాయి. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూకు పిల్లలంటే అమితమైన ఇష్టం. దేశ ప్రగతికి వారి విద్య, శ్రేయస్సు మూల స్తంభాలుగా నిలుస్తాయని ఆయన విశ్వసించారు. చిన్నారులు ఈయన్ను ‘చాచా నెహ్రూ’ అని పిలిచేవారు. జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని ఏటా నవంబరు 14న మన దేశంలో ‘బాలల దినోత్సవం’గా (Children’s Day) నిర్వహిస్తారు. బాల్యం గొప్పతనాన్ని, పిల్లల హక్కులను చాటిచెప్పడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం
జవహర్‌లాల్ నెహ్రూ 1889, నవంబరు 14న జన్మించారు. ఆయన ఎప్పుడూ పిల్లల విద్య, హక్కుల గురించి ఆలోచించేవారు. ఈయన పుట్టినరోజు నాడు ఏటా బాలల దినోత్సవంగా జరుపుకోవాలని 1957లో భారత ప్రభుత్వం తీర్మానించింది.