మొత్తం 3028 మందితో ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితా-2025ను విడుదల చేసింది. ప్రపంచంలో 3000 మందికి పైగా కుబేరులు నమోదవ్వడం ఇదే తొలిసారి. గత ఏడాది వ్యవధిలో వీరంతా సగటున రోజుకు రూ.46,000 కోట్లకు పైగా సంపాదించారని ఫోర్బ్స్ తెలిపింది. సంవత్సరకాలంలో వీరి సంపద విలువ 2 లక్షల కోట్ల డాలర్లు (దాదాపు రూ.170 లక్షల కోట్లు) పెరగడంతో, వీరి మొత్తం సంపద 16.1 లక్షల కోట్ల డాలర్లకు చేరింది.
ముఖ్యాంశాలు:
ఫోర్బ్స్ ప్రపంచ ర్యాంకుల ప్రకారం, 18వ స్థానంలో నిలిచిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ భారత్‌లో, ఆసియాలో అగ్రస్థానంలో నిలిచారు. ఈయన సంపద విలువ 92.5 బిలియన్ డాలర్లుగా ఉంది. అదానీ (28వ ర్యాంకు) 56.3 బి.డాలర్లతో దేశీయంగా రెండో స్థానంలో, ఆసియాలో నాలుగో స్థానంలో ఉన్నారు. చైనా టిక్‌టాక్‌కు చెందిన జాంగ్ ఇమింగ్ (23వ ర్యాంకు), నోంగ్‌ఫు స్ప్రింగ్ వ్యవస్థాపకుడు ఝాంగ్ శాన్‌శాన్ (26) ఆసియాలో వరుసగా 2, 3 ర్యాంకుల్లో ఉన్నారు.
2024 జాబితాలో మస్క్ సంపద విలువ 195 బిలియన్ డాలర్లు కాగా, ప్రస్తుతం 342బి.డా.కు పెరిగింది. తాజా జాబితాలో ఆయనే మొదటి స్థానంలో నిలిచారు.
అగ్రగామి ప్రపంచ కుబేరులు
ర్యాంకు | పేరు | నికర సంపద (బిలియన్ డాలర్లు) |
1 | ఎలాన్ మస్క్ | 342 |
2 | మార్క్ జుకర్‌బర్గ్ | 216 |
3 | జెఫ్ బెజోస్ | 215 |
4 | లారీ ఎలిసన్ | 192 |
5 | బెర్నార్డ్ ఆర్నాల్ట్ | 78 |
6 | వారెన్ బఫెట్ | 154 |
7 | లారీ పేజ్ | 144 |
8 | సెర్గీ బ్రిన్ | 138 |
9 | అమాన్షియో ఒర్టెగా | 124 |
10 | స్టీవ్ బామర్ | 118 |