పాత్రికేయ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే పులిట్జర్ పురస్కారాలను 2025, మే 5న ప్రకటించారు. న్యూయార్క్ టైమ్స్‌కు నాలుగు, న్యూయార్కర్‌కు మూడు పురస్కారాలు లభించాయి. పులిట్జర్ ప్రతిష్ఠాత్మక పబ్లిక్ సర్వీస్ మెడల్ వరుసగా రెండోసారి ‘ప్రో పబ్లికా’కు దక్కింది. అమెరికాలో కఠిన అబార్షన్ చట్టాలు ఉన్న రాష్ట్రాల్లో అత్యవసర వైద్య సహాయం అందించడంలో వైద్యులు ఆలస్యం చేయడంతో మహిళలు మరణించడంపై కథనాలు అందించినందుకుగాను ‘ప్రో పబ్లికా’ పాత్రికేయులు కవిత సురానా, లిజ్జీ ప్రెస్సెర్, కసాండ్రా జరమిలో, స్టేసీ క్రానిట్జ్‌లకు పురస్కారం లభించింది.
ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2024 ఎన్నికల ప్రచారం సందర్భంగా హత్యాయత్నం నుంచి త్రుటిలో తప్పించుకున్న ఘటనకు సంబంధించిన కవరేజీకి వాషింగ్టన్ పోస్ట్‌కు పురస్కారం లభించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు అందించిన ఫొటో పాత్రికేయుడు డగ్ మిల్స్‌కు బ్రేకింగ్ న్యూస్ విభాగంలో అవార్డు లభించింది.