భారతదేశంలో పుట్టి చదువు, ఉద్యోగం, ఉపాధి కోసం ఇతర దేశాల్లో స్థిరపడిన వారిని ప్రవాసులుగా పేర్కొంటారు. విదేశాల్లోని భారత సంతతి వ్యక్తులకు పుట్టిన సంతానాన్ని కూడా ప్రవాస భారతీయులుగానే పరిగణిస్తారు. దేశాభివృద్ధిలో వీరి పాత్ర ఎనలేనిది. వారు ఇతర దేశాల్లో ఉంటూ స్వదేశంలోని తమ బంధువులు, స్నేహితులకు డబ్బు పంపుతుంటారు. తద్వారా విదేశీ మారక నిల్వలు పెరిగి, భారతదేశ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమయ్యేందుకు తోడ్పడుతున్నారు. విదేశాల్లో నివసిస్తోన్న భారతీయుల సహకారాన్ని గుర్తించి, గౌరవించే లక్ష్యంతో మన దేశంలో జనవరి 9న ‘ప్రవాసీ భారతీయ దివస్’గా (Pravasi Bharatiya Divas) నిర్వహిస్తున్నారు. దీన్నే నాన్-రెసిడెంట్ ఇండియన్ (ఎన్‌ఆర్‌ఐ) డే అని కూడా పిలుస్తారు. ఇతర దేశాల్లో స్థిరపడిన ప్రవాసులకు, భారత ప్రభుత్వానికి మధ్య సంబంధాలను బలోపేతం చేయడంతోపాటు తమ మూలాలు, సంస్కృతితో వారిని అనుసంధానం చేయడంపై ఈ రోజు ప్రధానంగా దృష్టి సారిస్తుంది.
చారిత్రక నేపథ్యం
భారత స్వాంతంత్య్రోద్యమాన్ని ముందుండి నడిపిన వ్యక్తుల్లో మహాత్మా గాంధీ ఒకరు. స్వరాజ్య పోరాటంలో చేరడానికి ముందు ఆయన దక్షిణాఫ్రికాలో ఉన్నారు. 1915, జనవరి 9న గాంధీజీ స్వదేశానికి తిరిగి వచ్చారు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని ఏటా ఆ తేదీన ‘ప్రవాసి భారతీయ దివస్’గా జరపాలని 2003లో నాటి వాజ్‌పేయీ ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుంచి 2014 వరకు ప్రతి సంవత్సరం దీన్ని నిర్వహించారు. 2015 నుంచి ఈ దినోత్సవాన్ని రెండేళ్లకోసారి జరపాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీర్మానించింది. ఆ రోజున సదస్సులు నిర్వహించి.. ప్రవాసులకు మరింత చేరువకావాలనేది ప్రభుత్వ లక్ష్యం.