మన దేశంలో ఎక్కువ మంది ప్రజలు మాట్లాడే భాష హిందీ. ఇది దేవనాగరి లిపిలో ఉంటుంది. ఉత్తర భారతదేశంలో దీన్ని కేవలం భాషగానే కాకుండా తమ సంస్కృతిలో భాగంగా పరిగణిస్తారు. భారత సంస్కృతిలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. మన రాజ్యాంగంలోని 351వ అధికరణం 8వ షెడ్యూల్‌లో హిందీని కేంద్ర ప్రభుత్వ అధికార భాషగా గుర్తిస్తూ పొందుపరిచారు. హిందీ భాష ప్రాముఖ్యతను చాటి చెప్పే లక్ష్యంతో ఏటా జనవరి 10న ‘ప్రపంచ హిందీ దినోత్సవం’గా(World Hindi Day) నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా హిందీ భాష వాడకాన్ని ప్రోత్సహించడంతోపాటు ఈ భాష మాట్లాడే సమూహాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం
హిందీ భాషను ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించే లక్ష్యంతో 1975, జనవరి 10న నాగ్‌పుర్‌లో మొదటి హిందీ ప్రపంచ సదస్సు జరిగింది. దీన్ని నాటి ప్రధాని ఇందిరా గాంధీ ప్రారంభించారు. 30 దేశాలకు చెందిన ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు.
ఈ సదస్సు జరిగిన జ్ఞాపకార్థం ఏటా జనవరి 10న ప్రపంచ హిందీ దినోత్సవం (విశ్వ హిందీ దివస్)గా జరపాలని 2006లో అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం దీన్ని నిర్వహిస్తున్నారు.