జీవావరణంలో మనుషులతోపాటు వన్యప్రాణులకు సమాన ప్రాధాన్యం ఉంది. వృక్ష, జంతు జాతులు సహజ పర్యావరణ వ్యవస్థలో భాగంగా ఉండి, ఆహార చక్రం సక్రమంగా కొనసాగడంలో ముఖ్య భూమిక పోషిస్తాయి. పర్యావరణ సమతౌల్యంలోనూ ఇవి కీలకంగా వ్యవహరిస్తాయి. అయితే అడవుల నిర్మూలన, సహజ ఆవరణ వ్యవస్థల విధ్వంసం లాంటి అనేక మానవ చర్యల కారణంగా ఎన్నో జాతులు ప్రస్తుతం అంతరించే స్థితికి చేరాయి. దీన్ని అరికట్టి వన్యప్రాణుల ప్రాముఖ్యం గురించి ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా మార్చి 3న ‘ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం’గా (World Wildlife Day) నిర్వహిస్తారు. వన్యప్రాణుల ఆవశ్యకత గురించి ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు అవి అంతరించడం వల్ల కలిగే నష్టం గురించి హెచ్చరించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం
అంతరించిపోతున్న జంతు, వృక్ష జాతుల్లో అంతర్జాతీయ వాణిజ్యంపై వాషింగ్టన్‌లో 1973, మార్చి 3న సమావేశం (The Convention on International Trade in Endangered Species of Wild Fauna and Flora - CITES) జరిగింది. అందులో త్వరగా అంతరించే ముప్పున్న వృక్షాలు, జంతువులతో ఒక జాబితా తయారు చేసి, వాటి పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రపంచ దేశాలన్నీ ఒప్పందం చేసుకున్నాయి. ఇది 1975, జులై 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ సమావేశాన్ని ‘వాషింగ్టన్ కన్వెన్షన్’ అని కూడా అంటారు. CITES జరిగిన రోజును పురస్కరించుకుని ఏటా మార్చి 3న ‘ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం’గా జరపాలని 2013, మార్చిలో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానించింది. 2014 నుంచి ప్రతి సంవత్సరం దీన్ని నిర్వహిస్తున్నారు.
2026 నినాదం: “Medicinal and Aromatic Plants: Conserving Health, Heritage and Livelihoods”