ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది రెడ్ క్రాస్ (ఐసీఆర్‌సీ) సహవ్యవస్థాపకులైన హెన్రీ డునాంట్ జయంతి సందర్భంగా ఏటా మే 8న ‘ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం’గా నిర్వహిస్తారు. దీన్నే ‘రెడ్ క్రెసెంట్ డే’ అని కూడా అంటారు.
రెడ్ క్రాస్ అనేది ప్రపంచ మానవతా సంస్థ. ఇందులో ఎలాంటి లాభాపేక్ష లేకుండా, అవిశ్రాంతంగా పనిచేసే స్వచ్ఛంద సేవకులు, సిబ్బంది, మద్దతుదారులను గౌరవించుకోవడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం:
1859లో ఇటలీలో జరిగిన సోల్ఫెరెనో యుద్ధం రెడ్ క్రాస్ స్థాపనకు మూలం. యుద్ధంలో వేలాదిగా మరణించిన, గాయపడిన వారిని ప్రత్యక్షంగా చూసిన స్విట్జర్లాండ్ వ్యాపారవేత్త హెన్రీ డునాంట్ తీవ్ర వేదనకు గురయ్యారు. సాయుధ పోరాటాల్లో క్షతగాత్రులైనవారికి సాయం చేసేందుకు ఆయన 1863లో ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రెసెంట్ మూవ్‌మెంట్‌ను ప్రారంభించారు. అదే ఏడాది ఫిబ్రవరి 17న తన సహచరులతో కలిసి జెనీవాలో ఐసీఆర్‌సీని ఏర్పాటు చేశారు.
1938లో లండన్‌లో ఐసీఆర్‌సీ 14వ సమావేశం జరిగింది. అందులో హెన్రీ డునాంట్ జన్మదినమైన మే 8న ‘ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం’గా జరుపుకోవాలని సభ్యులు నిర్ణయించారు. దీన్ని మొదటిసారి 1948లో నిర్వహించారు.