ప్రజల్లో సృజనాత్మకత, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా ఏటా ఏప్రిల్ 26న ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవాన్ని (World Intellectual Property Day) నిర్వహిస్తారు. పేటెంట్లు, కాపీరైట్స్, ట్రేడ్ మార్క్స్, డిజైన్లపై ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు అవి రోజువారీ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలియజేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం:
1967 జూన్ 11 నుంచి జులై 14 వరకు స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో యూఎన్‌ఓ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రపంచవ్యాప్తంగా మేధో సంపత్తి రక్షణ, సృజనాత్మక కార్యకలాపాలకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి, డబ్ల్యూఐపీఓ కన్వెన్షన్‌ను ఏర్పాటు చేయాలని భావించాయి. ఇది 1970, ఏప్రిల్ 26 నుంచి అమల్లోకి వచ్చింది. 1974 నుంచి యూఎన్‌ఓకు అనుబంధ సంస్థగా పనిచేస్తోంది. ప్రస్తుతం డబ్ల్యూఐపీఓలో 193 సభ్య దేశాలు ఉన్నాయి.
డబ్ల్యూఐపీఓ కన్వెన్షన్ అమల్లోకి వచ్చిన తేదీని పురస్కరించుకుని ఏప్రిల్ 26న ‘ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం’గా జరుపుకోవాలని 2000లో డబ్ల్యూఐపీఓ తీర్మానించింది. అప్పటి నుంచి ఏటా దీన్ని నిర్వహిస్తున్నారు.
2025 నినాదం: “IP and Music: Feel the Beat of IP”