భారత్‌లో ఉద్యోగాలు, ఉపాధి, నిరుద్యోగం, పేదరికం అంశాలపై ప్రపంచ బ్యాంకు నివేదికను విడుదల చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి దేశంలో పనిచేసే వయసులో ఉన్న జనాభా కంటే ఉద్యోగ వృద్ధి రేటు పెరిగిందని వివరించింది. అలాగే శ్రామిక శక్తిలో మహిళలు భాగస్వామ్యం వృద్ధి చెందుతున్నట్లు పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం, 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి దేశంలో ఉద్యోగ వృద్ధి పెరిగింది.
2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో పట్టణ నిరుద్యోగం 6.6 శాతానికి పడిపోయింది. ఇది 2017-18 తర్వాత నమోదైన అత్యల్ప నిరుద్యోగిత రేటు. 2018-19 తర్వాత మొదటిసారిగా ఎక్కువ మంది పురుషులు ఉపాధి కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు వలస వెళ్తున్నారు. గ్రామీణ మహిళలు వ్యవసాయ రంగంలో ఎక్కువగా ఉపాధిని పొందుతున్నారు.