Published on Apr 24, 2025
Current Affairs
ప్రపంచ పుస్తక - కాపీరైట్‌ దినోత్సవం
ప్రపంచ పుస్తక - కాపీరైట్‌ దినోత్సవం

ప్రపంచ పుస్తక - కాపీరైట్‌ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏటా ఏప్రిల్‌ 23న నిర్వహిస్తారు. దీన్నే ప్రపంచ పుస్తక దినోత్సవం అని కూడా అంటారు. రచయితలను గౌరవించడంతోపాటు ప్రజల్లో పుస్తక పఠనం పట్ల ఆసక్తి రేకెత్తించడం, సాహిత్యం పట్ల అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. 
మనిషి జీవనాన్ని ప్రభావితం చేసే అంశాల్లో పుస్తక పఠనం ఒకటి. గత సంఘటనలు, స్మృతులను తర్వాతి తరాలకు అందించడంతోపాటు సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటంలో, సాహిత్యాభివృద్ధిలో పుస్తకాలు ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. రచనలపై సంబంధిత రచయితకు పరిమిత సమయం వరకు ఉండే హక్కే కాపీ రైట్‌. 
చారిత్రక నేపథ్యం
ఎంతోమంది ప్రముఖ సాహిత్యవేత్తలు, రచయితలు ఏప్రిల్‌ 23న జన్మించారు, మరణించారు. మాన్యుయెల్‌ మొజియా వల్లెజో, విలియం షేక్‌స్పియర్‌ (జననం - మరణం ఒకేరోజు) హాల్డోర్‌ లాక్స్‌నెస్, మారిస్‌ డ్రూన్‌ లాంటివారు ఈ రోజు జన్మించగా.. జోసెఫ్‌ ప్లా, ఇంకా గార్సిలాసో వేగా, మిగ్యుల్‌ డి సర్వంటెస్‌ ఇదే తేదీన మరణించారు. వీరందరి జ్ఞాపకార్థం యునెస్కో జనరల్‌ అసెంబ్లీ ఏటా ఏప్రిల్‌ 23ను ‘ప్రపంచ పుస్తక దినోత్సవం’గా జరపాలని 1995లో తీర్మానించింది.