పప్పుధాన్యాలు ఆహారంలో అంతర్భాగం. ఇవి ముఖ్యమైన ప్రోటీన్ వనరు. పప్పుధాన్యాలు లెగ్యుమినేసి మొక్కలు కావడంతో అవి భూసారాన్ని పెంపొందించడానికి తోడ్పడతాయి. మానవ పోషణ, పర్యావరణ శ్రేయస్సు, సుస్థిర వ్యవసాయంలో పప్పుధాన్యాల పాత్రను గుర్తించే లక్ష్యంతో ఏటా ఫిబ్రవరి 10న ‘ప్రపంచ పప్పుధాన్యాల దినోత్సవం’గా (World Pulses Day) నిర్వహిస్తారు. వీటిని రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కలిగే బహుళ ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రజల్లో చైతన్యం కలిగించడంతోపాటు ఆహార భద్రత సాధనలో వీటి పాత్రను తెలియజేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం:
ప్రజలు ఆరోగ్యకర జీవనాన్ని సాగించడంలో పప్పుధాన్యాలు ముఖ్య భూమిక పోషిస్తాయి. తక్కువ ఖర్చుతో మానవ శరీరానికి అవసరమైన ప్రోటీన్ వీటి ద్వారా లభిస్తుంది. వీటి వినియోగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఐక్యరాజ్య సమితి (యూఎన్‌ఓ) 2013, డిసెంబరులో 2016 ఏడాదిని ‘అంతర్జాతీయ పప్పుధాన్యాల సంవత్సరం’గా ప్రకటించింది. అలాగే పప్పుధాన్యాల ప్రాముఖ్యతను మరింత విస్తృతం చేసే లక్ష్యంతో ఏటా ఫిబ్రవరి 10న ‘ప్రపంచ పప్పుధాన్యాల దినోత్సవం’గా జరుపుకోవాలని 2018, డిసెంబరులో యూఎన్ జనరల్ అసెంబ్లీ తీర్మానించింది. 2019 నుంచి ప్రతి సంవత్సరం ఈ రోజును నిర్వహిస్తున్నారు.