ఇంటర్నెట్, ఇతర సమాచార సాధనాల ఉపయోగాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే లక్ష్యంతో ఏటా మే 17న ప్రపంచ టెలీకమ్యూనికేషన్ దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
దీన్నే ‘వరల్డ్ టెలీకమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే’ అని కూడా అంటారు.
దేశాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్లడంలో డిజిటల్ టెక్నాలజీ కీలకపాత్ర పోషిస్తోంది.
టెలీకమ్యూనికేషన్, సమాచార వ్యవస్థలు ఆర్థిక, సామాజిక వ్యవస్థలకు అందించే ప్రయోజనాలను ప్రజలకు తెలియజేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం:
1850 దశకంలో ప్రపంచవ్యాప్తంగా టెలిగ్రాఫ్‌ల వినియోగం ఊపందుకుంది.
దీంతో దేశాల మధ్య టెలిగ్రాఫ్ సేవలను సరళీకృతం చేసి, ఒప్పందాలు కుదుర్చుకోవాలనే ఉద్దేశంతో 1865, మే 17న యూరప్‌కు చెందిన 20 దేశాల ప్రతినిధులు పారిస్‌లో సమావేశమయ్యారు.
అందులో అంతర్జాతీయ టెలిగ్రాఫ్ యూనియన్ (ఐటీయూ) ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.
1934లో దీని పేరును ఇంటర్నేషనల్ టెలీకమ్యూనికేషన్ యూనియన్‌గా మార్చారు.
1947 నుంచి ఇది యూఎన్‌ఓకు అనుబంధ సంస్థగా పనిచేస్తోంది.
ఐటీయూ ఏర్పాటుకు గుర్తుగా 1969 నుంచి ఏటా మే 17న ప్రపంచ టెలీకమ్యూనికేషన్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
2025 నినాదం: Gender equality in digital transformation