సమస్త ప్రాణకోటికి నీరు ప్రాణాధారం. ప్రకృతిలో లభించే అతిముఖ్యమైన సహజ వనరుల్లో ఇది ఒకటి. మానవ ఆరోగ్యం, వ్యవసాయం, పరిశ్రమలు, పర్యావరణ వ్యవస్థల సమతౌల్యానికి ఇది అత్యంత ఆవశ్యకం. అయితే ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న నీటి కొరత, కాలుష్యం, దుర్వినియోగం లాంటివి భూమి స్థిరత్వానికి తీవ్రముప్పును కలిగిస్తున్నాయి. నీటి ప్రాముఖ్యత, దాని సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా మార్చి 22న ‘ప్రపంచ జల దినోత్సవం’గా (World Water Day) నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా నీటికి సంబంధించిన సమస్యలను గుర్తించడంతోపాటు నీరు, పారిశుద్ధ్య సంక్షోభాన్ని వేగంగా పరిష్కరించేలా చర్యలు చేపట్టడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం:
1992, జూన్ 3 - 14 తేదీల్లో బ్రెజిల్‌లోని రియో డి జెనీరో వేదికగా ఐక్యరాజ్య సమితి పర్యావరణం, అభివృద్ధి సమావేశం (United Nations Conference on Environment and Development - UNCED) జరిగింది. దీన్నే ‘ఎర్త్ సమ్మిట్’ అని కూడా అంటారు. నీటి ప్రాముఖ్యత, దాని నిర్వహణ గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏటా మార్చి 22న ‘ప్రపంచ జల దినోత్సవం’గా జరపాలని ఈ సందర్భంగా సభ్య దేశాలు భావించాయి. అదే ఏడాది ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం ఈ రోజును అధికారికంగా నిర్వహించాలని తీర్మానించింది. 1993లో మొదటి ‘వరల్డ్ వాటర్ డే’ను ప్రపంచవ్యాప్తంగా నిర్వహించారు.
2026 నినాదం: "Water and Gender"