Published on Jul 12, 2025
Current Affairs
ప్రపంచ జనాభా దినోత్సవం
ప్రపంచ జనాభా దినోత్సవం

జనాభా పెరుగుదల వల్ల కలిగే సమస్యలు, సమాజంపై దాని ప్రభావాన్ని తెలియజేసే లక్ష్యంతో ఏటా జులై 11న ‘ప్రపంచ జనాభా దినోత్సవం’గా నిర్వహిస్తారు. ఒక ప్రదేశంలో నివసించే ప్రజల సంఖ్యను జనాభా అంటారు. మరణాల రేటు తగ్గుతూ, జననాల రేటు పెరిగితే మొత్తం జనాభాలో పెరుగుదల కనిపిస్తుంది. దీన్నే ‘జనాభా విస్ఫోటనం’ అంటారు. ప్రస్తుతం భారత్‌ సహా అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ ఈ దశలోనే ఉన్నాయి. కుటుంబ నియంత్రణ, లింగసమానత్వం మొదలైనవాటి గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

చారిత్రక నేపథ్యం:

1830లో ప్రపంచ జనాభా ఒక బిలియన్‌ ఉండేది. 1987 నాటికి అది అయిదు బిలియన్లకు చేరింది. అయిదో బిలియన్‌ చివరి శిశువు 11 జులై 1987లో యుగోస్లావియాలో జన్మించాడు.

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఏటా జులై 11న ‘ప్రపంచ జనాభా దినోత్సవం’గా జరుపుకోవాలని యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (యూఎన్‌డీపీ) పాలకమండలి 1989లో నిర్ణయించింది. 

ఇదే ప్రతిపాదనను 1990, డిసెంబరులో యూఎన్‌ జనరల్‌ అసెంబ్లీ కూడా ఆమోదించింది.