- జీవుల మనుగడకు, పర్యావరణ సమతౌల్యతకు చిత్తడి నేలలు ఎంతో అవసరం. శీతోష్ణస్థితి, వరదల నియంత్రణ, నీటి శుద్ధి, పర్యావరణ పరిరక్షణలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అంటార్కిటికా మినహా అన్ని ఖండాల్లో ఇవి ఉన్నాయి. చిత్తడి నేలలు ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తాయి, నీటిని శుభ్రపరుస్తాయి, వరదలను నివారిస్తాయి, అనేక రకాల మొక్కలు - జంతువులకు ఆవాసాలుగా ఉంటాయి. ప్రాణికోటికి ఎంతో ఉపయోగకరమైన ఈ నేలలు కొన్నేళ్లుగా కనుమరుగవుతున్నాయి. జనాభా పెరుగుదల, పట్టణీకరణ లాంటివి ఇందుకు ప్రధాన కారణాలు. చిత్తడి నేలల ప్రాముఖ్యత గురించి ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా ఫిబ్రవరి 2న ‘ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం’గా (World Wetlands Day) నిర్వహిస్తారు. పర్యావరణ పరిరక్షణలో ఈ నేలల పాత్ర గురించి ప్రజలకు తెలియజేయడంతోపాటు వీటిని కాపాడుకోవడం ఎంత ఆవశ్యకమో చాటిచెప్పడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
- చారిత్రక నేపథ్యం
- 1971, ఫిబ్రవరి 2న ఇరాన్‌లోని రామ్‌సర్ పట్టణంలో ఒక సదస్సు నిర్వహించారు. ఇందులో భారత్ సహా 164 దేశాలు చిత్తడి నేలల పరిరక్షణకు సూచించిన ఉమ్మడి ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఈ సమావేశానికి గుర్తుగా 1997, ఫిబ్రవరి 2న మొదటిసారి ‘ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని’ జరిపారు. అప్పటి నుంచి ఏటా దీన్ని నిర్వహిస్తున్నారు.