ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్టూనిస్టుల సృజనాత్మకత, సామర్థ్యాలను గుర్తించే లక్ష్యంతో ఏటా మే 5న ప్రపంచ కార్టూనిస్టుల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. కార్టూన్ల ప్రాముఖ్యతను ప్రోత్సహించడంతోపాటు ఆ కళ గొప్పతనం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. వ్యంగ్యం లేదా హాస్యం కోసం ఉద్దేశించిన డ్రాయింగ్‌ను కార్టూన్‌గా పేర్కొంటారు. సమాజంలో మార్పును తీసుకొచ్చే శక్తి కూడా వీటికి ఉంటుంది.
చారిత్రక నేపథ్యం:
1985, మే 5న న్యూయార్క్ వరల్డ్ వార్తా పత్రికలో వాణిజ్యపరంగా మొదటి కార్టూన్‌ను ప్రచురించారు. ఇది ‘ఎల్లో కిడ్’గా ప్రసిద్ధి. 1943లో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికాకు చెందిన ప్రముఖ కార్టూనిస్టులు - గస్ ఎడ్సన్, ఒట్టో సోగ్లో, కారెన్స్ డి రస్సెల్ మొదలైనవారు తమ దేశ సైన్యాన్ని ఉత్తేజపరిచేందుకు కార్టూన్ ప్రదర్శనలు నిర్వహించారు. యుద్ధం ముగిశాక కూడా ప్రదర్శనలు కొనసాగేందుకు వీలుగా కారెన్స్ డి రస్సెల్ 1946లో ‘నేషనల్ కార్టూనిస్ట్స్ సొసైటీ’ని ఏర్పాటు చేశారు. కార్టూనిస్టులకు మరింత ప్రాచుర్యం కల్పించే ఉద్దేశంతో ఏటా మే 5న ‘ప్రపంచ కార్టూనిస్టుల దినోత్సవం’గా జరుపుకోవాలని ఈ సొసైటీ 1990లో తీర్మానించింది.