- ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. దీని వల్ల ఏటా లక్షలాది ప్రజలు ప్రభావితమవుతున్నారు. ఇందులో శరీరంలోని కొన్ని కణాలు అనియంత్రితంగా పెరిగి, ఇతర భాగాలకు వ్యాపిస్తాయి. ట్రిలియన్ల కణాలతో కూడిన మానవ దేహంలో ఎక్కడైనా క్యాన్సర్ రావొచ్చు. వ్యాధి నివారణ, ముందస్తు గుర్తింపు, సమర్థ చికిత్స పొందడం గురించి ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా ఫిబ్రవరి 4న ‘ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం’గా (World Cancer Day) నిర్వహిస్తారు. ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించేలా చేయడంతో పాటు క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడటంపై ప్రపంచ దేశాలను ఏకం చేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
- చారిత్రక నేపథ్యం
- క్యాన్సర్‌ను నిర్మూలించే లక్ష్యంతో 2000, ఫిబ్రవరి 4న పారిస్‌లో ‘వరల్డ్ క్యాన్సర్ సమ్మిట్ ఫర్ ది న్యూ మిలీనియం’ అనే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నాటి యునెస్కో డైరెక్టర్ జనరల్ కిచిరో మట్సురా, ఫ్రెంచ్ అధ్యక్షుడు జాక్వెస్ చిరాక్ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పారిస్ చార్టర్‌పై సంతకాలు చేశారు. ఈ సదస్సు జరిగిన తేదీకి గుర్తుగా ఏటా ఫిబ్రవరి 4న ‘ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం’గా జరుపుకోవాలని యూఐసీసీ తీర్మానించింది.