Published on Jan 2, 2026
Current Affairs
ప్రపంచ కుటుంబ దినోత్సవం
ప్రపంచ కుటుంబ దినోత్సవం
  • ఒక ఇంట్లో నివసించే కొందరు వ్యక్తుల సమూహాన్నే కుటుంబంగా పేర్కొంటారు. వీరి మధ్య వైవాహిక, రక్తసంబంధాలు ఉంటాయి. ప్రపంచంలోని అన్ని సమాజాల్లోనూ కుటుంబ వ్యవస్థ కనిపిస్తుంది. మనిషి సామాజిక జీవనానికి ఇదే మూలం. వ్యక్తికి సమాజంలో తొలి గుర్తింపు కుటుంబం ద్వారానే లభిస్తుంది. అంతేకాక బాధ్యత ఉన్న వ్యక్తిగా మెలగడానికి అవసరమైన శిక్షణ ఇదే అందిస్తుంది. కుటుంబ వ్యవస్థ గొప్పతనం, ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా జనవరి 1న ‘ప్రపంచ కుటుంబ దినోత్సవం’గా (Global Family Day) నిర్వహిస్తారు. ప్రజల మధ్య ఐక్యత, శాంతిని పెంపొందించడంతోపాటు మనమంతా ప్రపంచ కుటుంబంలో భాగం అనే భావనను విస్తృతం చేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
  • చారిత్రక నేపథ్యం
  • ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ 1998, నవంబరులో 21వ శతాబ్దపు మొదటి దశాబ్దాన్ని ప్రపంచవ్యాప్తంగా పిల్లల్లో శాంతి, అహింసను ప్రోత్సహించాలని భావించింది. దీనికి అనుగుణంగా 2001-10 కాలాన్ని The International Decade for a Culture of Peace and Non-Violence for the Children of the World గా ప్రకటించింది. 
  • కుటుంబ వ్యవస్థ ద్వారానే దీన్ని సాధించడం కుదురుతుందని యూఎన్‌ఓ భావించింది. 2000, జనవరి 1న ఐక్యరాజ్య సమితి ‘వన్‌ డే ఇన్‌ పీస్‌’ అనే పుస్తకాన్ని విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా శాంతియుత వాతావారణం ఉండాలంటే ప్రజలంతా ఒకే కుటుంబం అనే భావనతో మెలగాలని అందులో సూచించారు. దీనికి మరింత ప్రాచుర్యం కల్పించే ఉద్దేశంతో యూఎన్‌ఓ ఏటా జనవరి 1న ‘ప్రపంచ కుటుంబ దినోత్సవం’గా జరపాలని తీర్మానించింది.