Published on Jun 18, 2025
Current Affairs
ప్రపంచ ఎడారీకరణ - కరవు కట్టడి దినోత్సవం
ప్రపంచ ఎడారీకరణ - కరవు కట్టడి దినోత్సవం

ఎడారీకరణ, భూ క్షీణత, కరవు పరిస్థితుల వల్ల కలిగే నష్టాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా జూన్‌ 17న ‘ప్రపంచ ఎడారీకరణ - కరవు కట్టడి దినోత్సవం’గా (World Day to Combat Desertification and Drought) నిర్వహిస్తారు. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు మానవులు తమ కార్యకలాపాలను విస్తరిస్తున్న ఫలితంగా భూమి, నీరు, గాలి కాలుష్యం బారిన పడుతున్నాయి. అడవుల నరికివేత కారణంగా జీవవైవిధ్యం సన్నగిల్లుతోంది. దీంతో భూమి సహజ స్వభావానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోంది. వాతావరణ మార్పుల దుష్ప్రభావాలు హెచ్చరిల్లుతున్నాయి. ఎడారీకరణను ఎదుర్కోవడానికి చేపట్టాల్సిన చర్యలు, నేల సారాన్ని పెంచే ప్రయత్నాల గురించి ప్రజలను చైతన్యపరచడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

చారిత్రక నేపథ్యం:

1992లో బ్రెజిల్‌లోని రియో డి జెనిరోలో జరిగిన ఎర్త్‌ సమ్మిట్‌లో స్థిర అభివృద్ధికి ఎడారీకరణ, కరవు ప్రధాన అవరోధాలుగా గుర్తించారు.

దీనికి అనుగుణంగా ఐక్యరాజ్య సమితి (ఐరాస) 1994, జూన్‌ 17న యునైటెడ్‌ నేషన్స్‌ కన్వెన్షన్‌ టు కంబాట్‌ డిసర్టిఫికేషన్‌ (యూఎన్‌సీసీడీ)ని నెలకొల్పింది.

పర్యావరణ సమతౌల్యం, సుస్థిర అభివృద్ధితో కూడిన భూనిర్వహణపై ఇది ప్రధానంగా దృష్టి సారిస్తుంది.

ఐరాస ప్రపంచవ్యాప్తంగా ఏటా అదే తేదీన ‘ప్రపంచ ఎడారీకరణ - కరవు కట్టడి దినోత్సవం’గా జరుపుకోవాలని అన్ని దేశాలకు పిలుపునిచ్చింది.

అప్పటి నుంచి ఏటా దీన్ని నిర్వహిస్తున్నారు.

2025 నినాదం: Restore the land. Unlock the opportunities.