Published on Aug 14, 2025
Current Affairs
ప్రపంచ అవయవదాన దినోత్సవం
ప్రపంచ అవయవదాన దినోత్సవం

అవయవ దానం గురించి ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా ఆగస్టు 13న ‘ప్రపంచ అవయవదాన దినోత్సవం’గా (World Organ Donation Day) నిర్వహిస్తారు.

మనిషి శరీరంలోని అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తేనే ఆనందమయ జీవనాన్ని సాగిస్తారు.

శరీర కీలక భాగాలు విఫలమైనప్పుడు అవయవ మార్పిడితో ఎంతో మందికి కొత్త జీవితాన్ని ఇవ్వొచ్చు.

అయితే అవయవాలు అందుబాటులో లేకపోవడమే దీనికి ప్రధాన ఆటంకంగా మారింది.

బతికున్నవారు రక్తం, కిడ్నీ, కాలేయం లాంటివి దానం చేయొచ్చు.

గుండె, చర్మం, ఊపిరితిత్తులు, కంటి కార్నియా మొదలైనవాటిని బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తి నుంచే సేకరించే వీలుంది.

18 ఏళ్లు దాటిన ఎవరైనా అవయవ దానానికి అర్హులే.

అవయవదాన ప్రాముఖ్యత గురించి ప్రజలను చైతన్యపరచి, అవయవ దాతలుగా నమోదు చేసుకునేలా వారిని ప్రోత్సహించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

చారిత్రక నేపథ్యం: 
అమెరికాకు చెందిన రోనాల్డ్‌ లీ హెర్రిక్‌ 1954, ఆగస్టు 13న తన కిడ్నీని కవల సోదరుడికి దానం చేశారు.

డాక్టర్‌ జోసెఫ్‌ ముర్రే అవయవ మార్పిడిని విజయవంతంగా పూర్తిచేశారు.

వైద్య చరిత్రలో ఈ విధమైన ఆపరేషన్‌ నిర్వహించడం అదే తొలిసారి.

దీన్ని స్మరించుకునేందుకు ఏటా ఆ తేదీన ‘ప్రపంచ అవయవదాన దినోత్సవం’గా జరుపుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) 2005లో తీర్మానించింది.

మన దేశంలో జాతీయ అవయవదాన దినోత్సవాన్ని ఏటా ఆగస్టు 3న నిర్వహిస్తారు.