Published on May 26, 2025
Current Affairs
ప్రపంచంలో నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌
ప్రపంచంలో నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌

ప్రపంచంలో నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించిందని నీతి ఆయోగ్‌ సీఈఓ బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం వెల్లడించారు.

దేశ స్థూల దేశీయోత్పత్తి 4.19 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.356 లక్షల కోట్ల)కు చేరుకుందని.. జపాన్‌ కంటే 4.187 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.35,600 కోట్లు) అధికంగా మన ఆర్థిక వ్యవస్థ ఉందన్న అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) అంచనా గణాంకాలను ఆయన వెల్లడించారు. అమెరికా, చైనా, జర్మనీ తరవాత స్థానంలో మనదేశం ఉందని వివరించారు.

ఐఎంఎఫ్‌ 2025, ఏప్రిల్‌లో విడుదల చేసిన ప్రపంచ ఆర్థిక భవిష్యత్తు (డబ్ల్యూఈఓ) నివేదిక ప్రకారం, భారత తలసరి ఆదాయం 2013-14లో 1,438 డాలర్లు (రూ.1.22 లక్షలు) కాగా 2025లో రెట్టింపై 2,880 డాలర్ల (రూ.2.45 లక్షల)కు పెరిగింది.

2025-26లో భారత జీడీపీ వృద్ధి 6.2 శాతంగా ఉండొచ్చు. వాణిజ్య ఉద్రిక్తతలు, అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో గతంలో అంచనా వేసిన 6.5% కంటే, వృద్ధిరేటు నెమ్మదించొచ్చు.

అంతర్జాతీయ వృద్ధి 2025లో 2.8 శాతంగా ఉండొచ్చు. గత అంచనా కంటే ఇది 0.5% తక్కువ. 2026లో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ 3%  వృద్ధి నమోదు చేయొచ్చు.