దేశంలో ప్రతిష్ఠాత్మకమైన ప్రధానమంత్రి అవార్డును 2023-24 ఏడాదికి గాను ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి ప్రసన్న వెంకటేశ్ అందుకున్నారు. 2025, ఏప్రిల్ 21న ‘సివిల్ సర్వీస్ డే’ సందర్భంగా దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును తీసుకున్నారు. పరిపాలనలో ఉత్తమ పనితీరు కనబరిచిన దేశంలోని 10 జిల్లాల కలెక్టర్లకు ఈ అవార్డును కేంద్రం అందిస్తుంది.
ప్రసన్న వెంకటేశ్ 2022 జనవరి నుంచి 2024 జులై వరకు ఏలూరు జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. ఆ సమయంలో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, మహిళలు, బాలికల్లో రక్తహీనత నివారణకు కృషి చేయడంతో పాటు గర్భిణులు, బాలింతల ఆరోగ్య సంరక్షణకు ఆయన పాటుపడ్డారు. అందుకు తాజాగా ఈ అవార్డు వచ్చింది.