దేశానికి వచ్చే వివిధ దేశాల విద్యార్థుల సంఖ్య ఆంధ్రప్రదేశ్, పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్‌లలో పెరిగిందని కేంద్ర ఆర్థిక సర్వే వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం 2026, జనవరి 29న ఆర్థిక సర్వే-2025-26ను విడుదల చేసింది. గతంలో విదేశీ విద్యార్థులను ఆకర్షించడంలో ప్రధాన కేంద్రాలుగా ఉన్న కర్ణాటక, తమిళనాడులలో ప్రస్తుతం ప్రవేశాలు తగ్గగా.. కొత్తగా దక్షిణాదిలో ఏపీలో విదేశీ విద్యార్థుల నమోదు పెరిగింది. ఆయా రాష్ట్రాలు పాటిస్తున్న విధానాలు, సంస్థాగత సామర్థ్యం, అవగాహన కార్యక్రమాలు విద్యార్థుల ప్రవేశాల పెంపునకు దోహదం చేస్తున్నాయి.
భారత్‌కు వస్తున్న వారిలో నేపాల్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, భూటాన్‌లాంటి పొరుగు దేశాలకు చెందిన వారే ఎక్కువ. వీరు 13 రకాల కోర్సుల్లోనే ప్రవేశాలు పొందుతున్నారు. ఎక్కువగా బీటెక్, బీబీఏ, బీఎస్సీ కోర్సుల్లో చేరుతున్నారు.
దేశానికి వచ్చే విదేశీ విద్యార్థుల సంఖ్య 2000-01లో 7 వేలలోపు ఉండగా.. 2020 నాటికి సుమారు ఇది 49 వేలకు చేరింది. అయినప్పటికీ ఇది మొత్తం ఉన్నత విద్యలో నమోదైన విద్యార్థుల్లో కేవలం 0.10 శాతమే.