బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా స్వేచ్ఛా, స్వాతంత్య్రాల కోసం పోరాడిన ముఖ్య వ్యక్తుల్లో సుభాష్ చంద్రబోస్ ఒకరు. భారతీయులందరూ ప్రేమతో ఈయన్ను నేతాజీ అని పిలుస్తారు. దేశ స్వరాజ్య సాధనకు సాయుధ పోరాటమే మార్గమని ఆయన విశ్వసించారు. తన ప్రసంగాలతో యువతలో స్ఫూర్తి నింపి ఆంగ్లేయులను తరిమికొట్టేలా ప్రేరేపించారు. స్వతంత్ర భారతావనిని సాధించడానికి ఆజాద్ హింద్ ఫౌజ్ పేరిట ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేశారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్రత్యేక ప్రభుత్వాన్ని స్థాపించారు. భారత ప్రజల విశేష ఆదరాభిమానాలు పొందిన సుభాష్ చంద్రబోస్ జయంతి రోజైన జనవరి 23న దేశవ్యాప్తంగా ఏటా ‘పరాక్రమ్ దివస్’గా నిర్వహిస్తారు. దేశ పౌరుల్లో దేశభక్తిని పెంపొందించడంతోపాటు కష్ట సమయాల్లో యువత ధైర్య, సాహసాలతో ఉండేలా ప్రోత్సహించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం
జాతీయోద్యమంలో బోస్ పాత్రను గౌరవించుకునే లక్ష్యంతో భారత ప్రభుత్వం 2021లో ఆయన జన్మదినమైన జనవరి 23న ‘పరాక్రమ్ దివస్’గా ప్రకటించింది. అప్పటి నుంచి ఏటా దీన్ని నిర్వహిస్తున్నారు.