* 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కళ, సామాజిక సేవ, ప్రజా సంబంధాలు, శాస్త్ర, సాంకేతికత, ఇంజినీరింగ్, వాణిజ్యం, పరిశ్రమ, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, పౌర సేవల రంగాల్లో విశేష కృషి చేసిన 131 మందికి ఈ పౌర పురస్కారాలను 2026, జనవరి 26న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఐదుగురు దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్; 13 మంది పద్మ భూషణ్; 113 మంది పద్మశ్రీలకు ఎంపికయ్యారు.
* పద్మ పురస్కారాలకు ఎంపికైన వారిలో 19 మంది మహిళలు, ఆరుగురు విదేశీయులు/ ఎన్‌ఆర్‌ఐ/ పీఐఓ/ ఓసీఐలు ఉన్నారు. 16 మందికి మరణానంతరం ప్రకటించారు. పద్మ విభూషణ్‌కు ఎంపికైన ఐదుగురిలో ముగ్గురు కేరళకు చెందినవారే. 2026 మార్చి, ఏప్రిల్ నెలల్లో రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ పౌర పురస్కారాలను విజేతలకు ప్రదానం చేస్తారు.
పద్మ విభూషణ్ పొందినవారు..
ధర్మేంద్ర సింగ్ దేవోల్: మహారాష్ట్రకు చెందిన ఈయనకు కళల విభాగంలో అవార్డు పొందారు. 1935లో పంజాబ్‌లో పుట్టిన ధర్మేంద్ర సీనియర్ నటుడు దిలీప్ కుమార్ స్ఫూర్తితో ముంబయికి చేరి సినిమా హీరో అయ్యారు. ఈయన 2025, నవంబరులో కన్నుమూశారు. 2012లో ధర్మేంద్రను ‘పద్మ భూషణ్’తో సత్కరించిన భారత ప్రభుత్వం.. తాజాగా దేశ రెండో అత్యున్నత పురస్కారమైన ‘పద్మ విభూషణ్’ను (మరణానంతరం) ప్రకటించింది.
కె.టి.థామస్: కేరళకు చెందిన థామస్ సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి. 1937 జనవరి 30న కేరళలోని కొట్టాయం జిల్లాలో జన్మించిన ఆయన 1996 మార్చి 29 నుంచి 2002 జనవరి 30 వరకు సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పని చేశారు. 2007లో పద్మ భూషణ్ అవార్డు అందుకున్నారు. ప్రజా సంబంధాల విభాగంలో ఈ పురస్కారం దక్కింది.
ఎన్.రాజం: డాక్టర్ ఎన్.రాజం కళల రంగంలో ఉత్తర్ ప్రదేశ్ నుంచి పద్మ విభూషణ్‌కు ఎంపికైనప్పటికీ ఆమె 1938 ఏప్రిల్ 8న చెన్నైలో జన్మించారు. వయొలిన్ విద్వాంసురాలుగా వాసికెక్కారు. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో పేరు పొందారు. మనుషుల స్వరాన్ని తలపించేలా వయొలిన్‌ను పలికించడంద్వారా ఆమె ‘సింగింగ్ వయొలినిస్ట్’గా ప్రఖ్యాతి గడించారు. 1984లో పద్మశ్రీ, 2004లో పద్మ భూషణ్, 1990లో సంగీత నాటక అకాడమీ, 2012లో సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్‌లు పొందారు.
పి.నారాయణన్: 1936 మే 28న కేరళలోని మనకాడ్ అనే గ్రామంలో నారాయణన్ జన్మించారు. ఆరెస్సెస్, జన సంఘ్ భావజాలాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి 1975లో కోళికోడ్ నుంచి ప్రారంభించిన జన్మభూమి పత్రికకు మేనేజర్‌గా, ప్రత్యేక కరస్పాండెంట్‌గా, ఎడిటర్‌గా పని చేశారు. 1992లో అదే పత్రికకు చీఫ్ ఎడిటర్‌గా పదోన్నతి పొందిన ఆయన 2000 సంవత్సరం వరకు అదే పదవిలో కొనసాగారు. సాహిత్యం, విద్య రంగంలో ఈ పురస్కారం పొందారు.
వి.ఎస్.అచ్యుతానందన్: కేరళ మాజీ ముఖ్యమంత్రి. 2006 నుంచి 2011 వరకు సీపీఎం తరఫున ముఖ్యమంత్రిగా పని చేశారు. 1923 అక్టోబరు 20న జన్మించిన ఆయన 101 ఏళ్ల వయసులో 2025 జులై 21న కన్నుమూశారు. ప్రజా సంబంధాల రంగంలో అవార్డు పొందారు.