భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తిరుపతిలో జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లో నుంచి 2024, డిసెంబరు 30న రాత్రి 10 గంటల 15 సెకన్లకు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సీ60 (పీఎస్‌ఎల్‌వీ)ని విజయవంతంగా ప్రయోగించింది.
పీఎస్‌ఎల్‌వీ-సీ60 ద్వారా ప్రధానంగా స్పేడెక్స్ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతోపాటు మరో 24 పేలోడ్‌లనూ అంతరిక్షంలోకి పంపారు.
స్పేడెక్స్‌లో ఛేజర్ ఉపగ్రహం (ఎస్‌డీఎక్స్01), టార్గెట్ ఉపగ్రహం (ఎస్‌డీఎక్స్02) ఉన్నాయి. ఒక్కోదాని బరువు 220 కిలోలు.
ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ బయలుదేరిన 15.09 నిమిషాలకు స్పేడెక్స్-1బి, 15.12 నిమిషాలకు స్పేడెక్స్-1ఎ రాకెట్ నుంచి విడిపోయాయి.
ఈ రెండు ఉపగ్రహాలను ఉపయోగించి అంతరిక్షంలో డాకింగ్ సాంకేతికతను ప్రదర్శించడమే ఈ మిషన్ లక్ష్యం.
ఇప్పటి వరకు చైనా, రష్యా, అమెరికా మాత్రమే అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను అనుసంధానం చేస్తున్నాయి. ఈ తరహా సాంకేతికతలో తాజాగా భారత్ కూడా వాటి సరసన చేరింది.