మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలోని ఓంకారేశ్వర్ డ్యామ్‌లో నీటిపై సోలార్ ప్యానళ్లను అమర్చి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. నర్మదా నదిపై నిర్మించిన ఈ డ్యామ్ వెనుక జలాల్లో దాదాపుగా 7 లక్షల సోలార్ ప్యానళ్లను వరుస క్రమంలో అమర్చి 278 మెగా వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ తరహాలో ఇంత భారీ స్థాయిలో నీటిపై సోలార్ ప్యానళ్లను ఏర్పాటు చేసి సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం దేశంలోనే ఇదే ప్రథమం.
ఈ సోలార్ ప్రాజెక్టును రేవా అల్ట్రా మెగా సోలార్ లిమిటెడ్ (ఆర్‌యూఎంఎస్‌ఎల్) నిర్వహిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద వాటిలో ఒకటిగా నిలిచేలా నర్మదా నదిపై మొత్తం 600 మెగావాట్ల సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేసేలా ప్రాజెక్టును ఏర్పాటు చేయాలనేది లక్ష్యం. అందులో భాగంగా తొలి దశలో 278 మెగావాట్ల సామర్థ్యంతో పూర్తి చేశారు. రెండో దశ పనులకు చర్యలు తీసుకుంటున్నారు.