2025లో మన దేశంలో ఇంటర్నెట్ వినియోగించే వారి సంఖ్య 90 కోట్లను అధిగమించనున్నట్లు ‘ది ఇంటర్నెట్ ఇన్ ఇండియా రిపోర్ట్ 2024’ నివేదిక వెల్లడించింది.
డిజిటల్ కంటెంట్ కోసం ప్రాంతీయ భాషల వినియోగం పెరగడమే ఇందుకు కారణమని తెలిపింది. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ), కాంటార్ సంయుక్తంగా ఈ నివేదికను తయారు చేశాయి.
నివేదికలోని అంశాలు:
2023తో పోలిస్తే 2024లో క్రియాశీల ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 8 శాతం పెరిగి 88.6 కోట్లుగా ఉంది. గ్రామీణ భారత్‌లో 48.8 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. మొత్తం ఇంటర్నెట్ జనాభాలో గ్రామీణ వాటా 55 శాతంగా ఉంది.
దేశంలో ఇంటర్నెట్ వినియోగ ధోరణుల్లో ప్రాంతీయ భాషల కీలక పాత్ర పోషిస్తున్నాయి. భారత భాషల్లోని కంటెంట్‌ను 98 శాతం మంది ఇంటర్నెట్ వినియోగదారులు వాడుతున్నారు.
తమిళం, తెలుగు, మళయాళం ఇందులో ముందున్నాయి. ఈ భాషల్లో కంటెంట్ అధికంగా లభించడం ఇందుకు తోడ్పడుతోంది.