దేశంలో వలసలు తగ్గుముఖం పట్టాయని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి అంచనావేసింది.
2011 జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 45,57,87,621 మంది వలస వెళ్లినట్లు తేల్చగా, 2023 నాటికి ఆ సంఖ్య 40,20,90,396కి తగ్గినట్లు పేర్కొంది.
2011తో పోలిస్తే ఇది 11.78% తక్కువ అని తెలిపింది. 2011 జనాభా లెక్కల ప్రకారం వలసల రేటు 37.64% ఉండగా, ఇప్పటి జనాభా లెక్కల ప్రకారం అది 28.88%కి పడిపోయినట్లు వెల్లడించింది.
గతంతో పోలిస్తే ఇప్పుడు దేశవ్యాప్తంగా విద్య, వైద్యం, మౌలికవసతులు, అనుసంధానతలాంటి సేవలు పెరగడం, ఆర్థిక అవకాశాలు మెరుగుపడటం వలసలు తగ్గడానికి ప్రధాన కారణమని ఆర్థికసలహా మండలి అభిప్రాయపడింది.