దిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను (50 ఏళ్లు) 2025, ఫిబ్రవరి 19న ఎంపికయ్యారు. 48 మంది భాజపా ఎమ్మెల్యేలు శాసనసభా పక్ష నేతగా ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
26 ఏళ్ల తర్వాత అక్కడ అధికారం సాధించిన భాజపా తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన రేఖాకు సీఎంగా అవకాశం ఇచ్చింది.
భాజపా అధికారంలో ఉన్న 14 రాష్ట్రాల్లో ఎక్కడా మహిళా ముఖ్యమంత్రి లేకపోవడంతో పార్టీ అధిష్ఠానం రేఖాగుప్తాను ఎంపిక చేసింది.
శాలీమార్ బాగ్ నుంచి ఆమె ఆప్ అభ్యర్థి వందన కుమారిపై 29,595 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
హరియాణాలోని జులానాలో 1974 జులై 19న రేఖా గుప్తా జన్మించారు. 1992లో ఏబీవీపీ ద్వారా విద్యార్థి రాజకీయాల్లో ప్రవేశించారు.
1995-96లో దిల్లీ వర్సిటీ విద్యార్థి సంఘం కార్యదర్శిగా పని చేశారు. 1996-97లో అధ్యక్షురాలిగా సేవలందించారు.
ప్రస్తుతం ఆమె భాజపా మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా ఉన్నారు.