ప్రజలు నిత్యం వినియోగించే వివిధ రకాల నిత్యావసర సరకుల ధరల పెరుగుదల (ద్రవ్యోల్బణం) అన్ని రాష్ట్రాలకంటే తెలంగాణలోనే అతితక్కువగా(4.24%) నమోదైంది.
2023 నవంబరుతో 2024 నవంబరులోని ధరల పెరుగుదల తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించి ‘వినియోగదారుల ధరల సూచిక’ (సీపీఐ)ను కేంద్ర గణాంకాల మంత్రిత్వశాఖ తాజాగా విడుదల చేసింది.
ఆహార ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు, పాలు, గుడ్లు, పెట్రోలు, డీజిల్, దుస్తులు, ఇళ్లు తదితరాల ధరలను దేశంలోని వివిధ ప్రాంతాల మార్కెట్ల నుంచి సేకరించి సీపీఐని రూపొందిస్తారు.
ఈ ధరల పెరుగుదల శాతం ఆధారంగా రాష్ట్రాలవారీగా ద్రవ్యోల్బణం శాతాన్ని ప్రకటిస్తారు.
రాష్ట్రాలవారీగా పరిశీలిస్తే అత్యధికంగా ఛత్తీస్‌గఢ్ 8.39%, బిహార్ 7.55%, ఒడిశా 6.78 శాతంతో తొలి మూడుస్థానాల్లో ఉన్నాయి.
ద్రవ్యోల్బణం జాతీయ సగటు 5.48%. అన్ని రాష్ట్రాలకన్నా అతి తక్కువగా తెలంగాణలో 4.24% ఉన్నట్లు సీపీఐ నివేదిక స్పష్టంచేసింది.