తెలంగాణ ప్రభుత్వం ‘తెలంగాణ క్రీడా పాలసీ-2025’ను అమలులోకి తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన జీవోను జులై 3న ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ జారీ చేశారు. స్పోర్ట్స్ పాలసీలో ప్రధానంగా ఐదు అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా క్రీడాపాలసీకి ప్రత్యేక పరిపాలన వ్యవస్థను ఏర్పాటు చేసి స్పోర్ట్స్ ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తారు. క్రీడారంగానికి కావాల్సిన మౌలిక వసతులను కల్పిస్తారు. క్రీడాకారులకు నైపుణ్యాభివృద్ధి, భవిష్యత్తుకు బాటలు వేస్తారు. అథ్లెట్ల అభివృద్ధికి దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తారు. రాష్ట్ర క్రీడారంగానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును తీసుకొస్తారు.