రక్షణశాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన సమావేశమైన రక్షణ కొనుగోళ్ల మండలి (డీఏసీ) రూ.54,000 కోట్ల విలువైన సైనిక ఆధునికీకరణ ప్రాజెక్టులకు 2025, మార్చి 1న ప్రాథమిక ఆమోదం తెలిపింది.
ఇందులో టి-90 ట్యాంకుల ఆధునికీకరణతో పాటు గగనతల ముందస్తు హెచ్చరికల వ్యవస్థల కొనుగోళ్లకు సంబంధించిన ప్రతిపాదనలూ ఉన్నాయి.
మరోవైపు ప్రధాని మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఎస్) కూడా కీలక నిర్ణయం తీసుకుంది.
దేశీయంగా అభివృద్ధి చేసిన అడ్వాన్స్డ్ టోవ్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ (అటాగ్స్) అనే శతఘ్నులను సైన్యంలో తీసుకోవాలని నిర్ణయించింది.
ఈ మేరకు రూ.7,000 కోట్ల విలువైన భారీ ఒప్పందానికి ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందం ప్రకారం మొత్తం 307 శతఘ్నులను సైన్యం కోసం కేంద్రం కొనుగోలు చేయనుంది.
దీంతో పాటు 327 గన్ టోయింగ్ వాహనాలకూ ఆర్డర్ ఇవ్వనుంది. అటాగ్స్.. దేశీయంగా అభివృద్ధి చేసిన 150 ఎం.ఎం.శతఘ్ని వ్యవస్థ. ఇందులో 52 క్యాలిబర్ బ్యారెల్ ఉంటుంది.
45 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను నాశనం చేయగల సామర్థ్యం దీని సొంతం. ఇందులో 65 శాతం దేశీయంగా తయారుచేసిన పరికరాలనే వినియోగించనున్నారు.
ఈ అటాగ్స్‌లను పాకిస్థాన్, చైనా సరిహద్దుల్లో భారత సైన్యం మోహరించే అవకాశం ఉంది.