గవర్నర్ ఆమోదం పొందకుండానే పది బిల్లులకు చట్ట హోదా కల్పిస్తూ తమిళనాడు ప్రభుత్వం 2025, ఏప్రిల్ 12న గెజిట్ విడుదల చేసింది.
గవర్నర్ లేక రాష్ట్రపతి ఆమోదం లేకుండా బిల్లులు చట్టంగా మారడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి.
ఏదైనా చట్టం చేయాల్సి వస్తే ముందుగా శాసనసభలో దాన్ని బిల్లుగా ప్రవేశపెట్టి, ఆ తర్వాత గవర్నర్ ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు పంపాల్సి ఉంది.
తన పరిధి దాటి, జాతీయ స్థాయిలో ముడిపడిన అంశాలకు సంబంధించిన బిల్లులు ఉంటే వాటిని రాష్ట్రపతి ఆమోదానికి గవర్నర్ పంపుతారు.
ఇదిలా ఉండగా తమిళనాడు శాసనసభ పంపిన పది బిల్లులను గవర్నర్ ఆర్.ఎన్.రవి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా రిజర్వులో ఉంచారు.
సుదీర్ఘకాలం పాటు బిల్లులను రిజర్వులో ఉంచడంతో స్టాలిన్ సర్కారు గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గవర్నర్ చర్య రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు వెలువరించింది.
అత్యున్నత న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో.. ఆ బిల్లులకు చట్ట హోదా కల్పిస్తూ శనివారం రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది.
2023 నవంబరు 18న వాటిని గవర్నర్ ఆమోదించినట్లు భావించాలని పేర్కొంది.