భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్(బి.ఆర్.గవాయ్) బాధ్యతలు చేపట్టనున్నారు.
సీనియారిటీ పరంగా తన తర్వాత స్థానంలో ఉన్న ఆయన పేరును సంప్రదాయానికి అనుగుణంగా కేంద్ర న్యాయశాఖకు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా 2025, ఏప్రిల్ 16న సిఫారసు చేశారు.
దీనికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం లాంఛనమే కానుంది.
మే 13న జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీ విరమణ చేయనున్నారు.
14న జస్టిస్ బి.ఆర్.గవాయ్ బాధ్యతలు చేపట్టనున్నారు.
6 నెలలకుపైగా ఆ పదవిలో కొనసాగనున్న ఆయన నవంబరు 23న పదవీ విరమణ చేస్తారు.
జస్టిస్ గవాయ్ 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సీజేఐగా బాధ్యతలను చేపట్టనున్న రెండో దళిత వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించనున్నారు. ఆయన కంటే ముందు 2007లో జస్టిస్ బాలకృష్ణన్ ఆ పదవిలో ఉన్నారు.