ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ హైకోర్టు 2025, నవంబరు 14న కీలక తీర్పు ఇచ్చింది. తీర్పు ప్రతి అందిన ఆరు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది. పిటిషనర్‌ను స్కూల్ అసిస్టెంట్ పోస్టులో నియమించే వ్యవహారాన్ని పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది.
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.విజయ్ ఇటీవల ఈ తీర్పు ఇచ్చారు. మెగా డీఎస్సీలో ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్ కల్పించకపోవడాన్ని సవాలు చేస్తూ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడేనికి చెందిన ట్రాన్స్‌జెండర్ (ఉమన్) కె.రేఖ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ట్రాన్స్‌జెండర్లకు పోస్టులు నోటిఫై చేయకపోవడంతో అధికారులు తనను ఉద్యోగానికి ఎంపిక చేయలేదన్నారు. పోస్టులు కేటాయించకపోవడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమన్నారు.